ముంబై జైత్రయాత్రకు గుజరాత్ బ్రేక్
Mubai Indians-Gujarath Titans: ఐపీఎల్ లో ముంబయి ఇండియన్స్ (Mumbai Indians) జైత్రయాత్రకు బ్రేక్ పడింది. ముంబయితో జరిగిన ఉత్కంఠ పోరులో గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) 3 వికెట్ల తేడాతో గెలుపొందింది.
తొలుత ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. విల్ జాక్స్ (53) ఒక్కడే అర్ధశతకంతో మెరిశాడు. అనంతరం వర్షం అంతరాయంతో డక్ వర్త్ లూయిస్ ప్రకారం.. గుజరాత్ లక్ష్యాన్ని 19 ఓవర్లలో 147 పరుగులుగా నిర్దేశించారు. దీంతో గుజరాత్ 7 వికెట్లు కోల్పోయి చివరి బంతికి విజయం సాధించింది.
ముంబయి బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, బుమ్రా, అశ్విని కుమార్ తలో రెండు వికెట్లు తీయగా చాహర్ ఒక వికెట్ పడగొట్టాడు. ఈ విజయంతో గుజరాత్ 11 మ్యాచ్ 8 విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది.
చివరి ఓవర్ ఉత్కంఠగా..
గుజరాత్ ఇన్నింగ్స్ 18 ఓవర్లు పూర్తయిన తర్వాత వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్ ను 19 ఓవర్లకు కుదించి లక్ష్యాన్ని 147 పరుగులుగా నిర్దేశించారు. 18 ఓవర్లు పూర్తయ్యే సరికి గుజరాత్ 6 వికెట్లు కోల్పోయి 132 పరుగులతో ఉంది. దీంతో చివరి ఓవర్లో గుజరాత్ లక్ష్యం 15 పరుగులుగా మారింది.
కొంప ముంచిన దీపక్ చాహర్
దీపక్ చాహర్ వేసిన ఈ ఓవర్ తొలి బంతికి తెవాతియా (11*) ఫోర్ బాదాడు. రెండో బంతికి సింగిల్ వచ్చింది. మూడో బంతికి కొయిట్టీ సిక్స్ కొట్టడంతో సమీకరణం 3 బంతుల్లో 4 పరుగులు మారింది. నాలుగో బంతికి నోబాల్ వేయగా, సింగిల్ వచ్చింది. తర్వాతి ఫ్రీ హిట్ బంతికి సింగిల్ రావడంతో స్కోర్లు సమమయ్యాయి . ఐదో బంతికి కొయిట్టీ ఔటయ్యాడు. దీంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. అయితే చివరి బంతికి అర్షద్ ఖాన్ సింగిల్ తీయడంతో గుజరాత్ శిబిరం సంబరాల్లో మునిగింది.
వర్షం దోబుచులాట..
156 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కి దిగిన గుజరాత్ 6 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. సూపర్ ఫామ్ లో ఉన్న సాయి సుదర్శన్ (5)ను బౌల్ట్ ఔట్ చేశాడు. అయితే బట్లర్ తో కలిసి గిల్ ఇన్నింగ్స్ ను నడిపించాడు. రెండో వికెట్ కు వీరి జోడి 72 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. ఈ దశలో 12 ఓవర్లో బట్లర్ ను అశ్విని కుమార్ ఔట్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన రూథర్ ఫోర్డ్ బౌండరీలతో విరుచుకుపడ్డాడు. 14 ఓవర్లు ముగిసిన తర్వాత వర్షం కురవడంతో మ్యాచ్ ను కాసేపు నిలిపివేశారు. అప్పటికి గుజరాత్ స్కోర్ 107/2.
అనంతరం మ్యాచ్ ప్రారంభమయ్యాక 14.5 ఓవర్ల వద్ద గిల్ ను బుమ్రా బౌల్డ్ చేశాడు. దీంతో మ్యాచ్ మలుపు తిరిగింది. అప్పటి వరకు సునాయసంగా గెలిచేలా కనిపించిన గుజరాత్ ఒక్కసారిగా కష్టాల్లో పడింది. తర్వాతి ఓవర్లో 115 పరుగుల వద్ద రూథర్ ఫోర్డ్ ను బౌల్ట్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. స్వల్ప తేడాతో షారుఖ్ ఖాన్, రషీద్ ఖాన్ ఔటయ్యారు. 18 ఓవర్లు పూర్తయ్యాక వర్షం మళ్లీ అంతరాయం కలిగించింది. దీంతో డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం.. 19 ఓవర్లకు కుదించారు. చివరి ఓవర్లలో గుజరాత్ లక్ష్యం 15 పరుగులు కాగా..
ఏడో వికెట్ కోల్పోయి ఆ జట్టు గెలుపుతీరాలకు చేరింది.
పాండ్య వేసిన ఆ ఓవర్ వల్ల..
హార్దిక్ పాండ్య వేసిన ఎనిమిదో ఓవర్ వల్ల ముంబైకి చాల నష్టం జరిగింది. ఆ ఓవర్లో పాండ్య రన్స్ ఇచ్చాడు. అందులో ౩ వైడ్స్, 2 నోబాల్స్ , ఫోర్, సిక్స్, రెండు సింగిల్స్ తో మొత్తం 18 రన్స్ ఇచ్చాడు. ఆ ఓవర్ స్లో ఓవర్ రేట్ కారణంగా లాస్ట్ ఓవర్లో సర్కిల్ అవతల 4 ఫీల్డర్స్ కు మాత్రమే అనుమతించారు. దానివల్ల గుజరాత్ కి కొంచెం అడ్వాంటేజ్ గా మారింది.